పరీక్షలపై నిర్లక్ష్యం వద్దు
ఉత్తీర్ణత శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
గురుకులాల ప్రిన్సిపల్స్‌తో మంత్రి పొన్నం జూమ్ మీటింగ్‌లో సమీక్ష
కాకతీయ, హైదరాబాద్: ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల పనితీరుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక జూమ్ సమావేశం నిర్వహించారు. పరీక్షల సన్నద్ధత, విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల కార్యాచరణపై ఆయన అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీధర్, గురుకులాల కార్యదర్శి సైదులు, ప్రిన్సిపల్స్, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. గత ఏడాది తక్కువ ఫలితాలు సాధించిన పాఠశాలలు ఈసారి తప్పనిసరిగా మెరుగైన ఫలితాలు చూపాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఫలితాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేక గ్రూపులుగా విభజించి స్పెషల్ క్లాసులు నిర్వహించాలని సూచించారు. బట్టి విధానానికి బదులు సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించాలని, రోజువారీ రివిజన్ చేయించాలని చెప్పారు. ఈ ఏడాది 294 గురుకులాల్లో 19,255 మంది పదో తరగతి విద్యార్థులు, 261 కళాశాలల్లో 26,812 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు అధికారులు వివరించారు. గత ఏడాది ఎస్సెస్సీలో 147 పాఠశాలలు, ఇంటర్‌లో 11 కళాశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతి 15 రోజులకు మెడికల్ చెకప్‌లు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పరీక్ష భయాన్ని తగ్గించేందుకు మోటివేషన్ తరగతులు నిర్వహించాలన్నారు. బీసీ గురుకులాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు.


