తెలంగాణకు నిధుల వరద
స్థానిక సంస్థలకు రూ.260 కోట్లు విడుదల చేసిన కేంద్రం
మిగిలిన రూ.2,500 కోట్లు దశలవారీగా మంజూరు
పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే నిధుల విడుదల
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవతో వేగవంతమైన నిర్ణయం
గతంలో రూ.11 వేల కోట్లకు పైగా కేటాయింపులు
రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్రం సూచన
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తయిన వెంటనే నిధులు విడుదల కావాలని ఆయన కేంద్ర పంచాయతీరాజ్ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి, అవసరమైన చర్యలు తీసుకోవడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. గత దశాబ్ద కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. 2015–16 నుంచి 2019–20 మధ్య కాలంలో తెలంగాణ గ్రామపంచాయతీలకు కేంద్రం రూ.5,060 కోట్లు విడుదల చేయగా, 2020–21 నుంచి 2025–26 మధ్య ఈ కేటాయింపులు 80 శాతం పెరిగి రూ.9,050 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు రూ.6,051 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు వివరించారు.
యుటిలైజేషన్ సర్టిఫికెట్లతో నిధుల విడుదల..!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చులపై యుటిలైజేషన్ సర్టిఫికెట్లను సమర్పించడంతో 2024–25 సంవత్సరానికి మొదటి విడతగా రూ.260 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నిధులు మంజూరు కావడం కేంద్రం చిత్తశుద్ధికి నిదర్శనమని కిషన్‌రెడ్డి తెలిపారు. మిగిలిన నిధులకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందగానే దశల వారీగా మరో రూ.2,500 కోట్ల నిధులు కూడా విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
పీఎఫ్‌ఎంఎస్ విధానం తప్పనిసరి..!
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి గ్రామపంచాయతీ ఈ నిధుల వినియోగానికి ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని, ఆ ఖాతాను పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్) పోర్టల్‌లో నమోదు చేసి ప్రత్యేక గుర్తింపు కోడ్ పొందాలని కేంద్రమంత్రి సూచించారు. ఈ విధానం ద్వారా నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల వరకు జవాబుదారీతనం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని ఆయన పేర్కొన్నారు. అందుకే స్థానిక సంస్థలకు నిధులను ఎప్పటికప్పుడు సమయానుగుణంగా విడుదల చేస్తోందని వివరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీల ఖాతాల్లోని నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంతో అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆ కారణంగా అప్పటి సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొందరు రాజీనామాలు చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడటం కూడా అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇకనైనా చొరవ తీసుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు అందిస్తుందని, వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.


