రేవంత్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు
క్రిమినల్ కేసులు కొట్టివేయాలని సీఎం అభ్యర్థన
విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా
కాకతీయ, హైదరాబాద్: తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంపై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. 2023 ఫిబ్రవరిలో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కొట్టివేయాలని, అలాగే విచారణపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. కేసు వివరాలను మరింత పరిశీలించాల్సి ఉన్నందున తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. దీంతో ఈ వ్యవహారంపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.


