రామాలయ దొంగతనం కేసు చేధించిన పోలీసులు
భార్యాభర్తల అరెస్ట్ – ఆభరణాలు, నగదు స్వాధీనం
కాకతీయ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్‌లో ఉన్న కోదండ రామాలయంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. గత నెల 3వ తేదీ అర్ధరాత్రి ఆలయ తాళం పగలగొట్టి, దేవుడికి చెందిన బంగారు–వెండి ఆభరణాలు, హుండీలోని నగదును దుండగులు అపహరించారు. ఆలయ పూజారి సముద్రాల జగన్మోహన్ చారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై ఎం. సుప్రియ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ నెల 6న కరీంనగర్ రోడ్డులోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆలయ దొంగతనంలో తామే పాల్గొన్నట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.4,357 నగదుతో పాటు ఆలయానికి చెందిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను తాటిపెల్లి గ్రామానికి చెందిన వడ్లూరి నాగరాజు, జగిత్యాల ధరూర్ క్యాంప్‌కు చెందిన వడ్లూరి రజితగా గుర్తించారు. ప్రజల ఆస్తుల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని డీఎస్పీ పేర్కొన్నారు. ఆలయాలు, ప్రజా ప్రదేశాల్లో దొంగతనాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.


