రూ.30 వేలు తగ్గిన వెండి
ఒక్క రోజులోనే దిగొచ్చిన ధర
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,59,680
కిలో వెండి ధర రూ.2,69,000
అంతర్జాతీయ మార్కెట్లోనూ తగ్గుదల
కాకతీయ, నేషనల్ డెస్క్: గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో ధరలు గురువారం కాస్త దిగొచ్చాయి. ముఖ్యంగా వెండి బుధవారంతో పోలిస్తే దాదాపు రూ.30 వేల మేర తగ్గింది. కిలో వెండి ధర రూ.2,69,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.6,600 తగ్గి రూ.1,59,680కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.1,41,550గా ఉంది. అంతర్జాతీయంగానూ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్సు బంగారం ధర 4919 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 79 డాలర్లుగా కొనసాగుతోంది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో డెలివరీ కాంట్రాక్టుకు వెండి దాదాపు 7 శాతం పడిపోయింది. కిలో ధర రూ.2.49 లక్షల వద్ద ఉంది. ఏప్రిల్ డెలివరీలకు పసిడి ధర స్వల్పంగా పెరిగి 10 గ్రాముల ధర రూ.1.53 లక్షలకు చేరింది. బుధవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇటీవల యూఎస్ ఫెడ్‌కు కొత్త ఛైర్మన్ నియామకం, సీఎంఈ మార్జిన్‌ను పెంచడం, గరిష్ఠాల వద్ద భారీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఈ రెండు లోహాల ధరలు భారీగా పెరిగాయి. దీన్ని అవకాశంగా తీసుకుని మదుపర్లు దీర్ఘకాలిక వ్యూహంతో కొనుగోళ్లకు దిగడం వల్ల వీటికి మళ్లీ డిమాండ్ ఏర్పడింది. దీంతో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ఔన్సు 4,887 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి 85.98 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ధరల్లో హెచ్చుతగ్గులు
అయితే వెండి ధరల్లోని ఈ హెచ్చుతగ్గులపై ‘ఆల్ ఇండియా జ్వెల్లర్స్ అండ్ గౌర్మెట్ ఫెడరేషన్’ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా ఇటీవల స్పందించారు. గత 15 రోజుల్లోనే వెండి ధర రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు పెరిగిందని అన్నారు. ఇంత వేగంగా, ఒకే దిశలో పెరగడం ఎప్పుడూ నిలకడగా ఉండదని తెలిపారు. అందుకే ఇప్పుడు ఈ హెచ్చుతగ్గులు అని చెప్పారు. అమెరికా వెండిని ‘క్రిటికల్ మినరల్’గా గుర్తించడం, చైనా ఎగుమతులను నియంత్రించడంతో డిమాండ్ పెరిగిందని అన్నారు. అయితే ఎక్స్చేంజీలలో జరిగే ‘పేపర్ ట్రేడ్’ వల్ల ధరల్లో ఇంత అస్థిరత వస్తోందని అన్నారు. బంగారం, వెండి ధరలు రోజుల నుంచి నిమిషాల వ్యవధిలో మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆభరణాల విక్రయదారులు ధరలను మార్చివేస్తున్నారు. ఆన్లైన్లో ధరలు ప్రకారమే నగదును వసూలు చేస్తున్నారు. కానీ ధరలు తగ్గినపుడు కొంతమంది వ్యాపారులు తగ్గింపును చూపడం లేదని కొనుగోలుదారులు అంటున్నారు. పెరిగిన ధరలనే చూపిస్తున్నారంటూ చెబుతున్నారు. నగలు కొనడానకి వెళ్లినప్పుడు ధరలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచింది.


