అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
నెల్లికుదురులో ఐదు ట్రాక్టర్లు సీజ్
ఏడుగురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
కాకతీయ, నెల్లికుదురు : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు హెచ్చరించారు. మండల పరిధిలోని బ్రాహ్మణకొత్తపల్లి ఆకేరువాగు నుంచి అనధికారికంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులు కలిపి మొత్తం ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు అయిన వారిలో జలక ఉమేష్, పెరుమండ్ల సంజీవ, పట్కాల యకన్న, పెరుమండ్ల కిరణ్, భూక్యా రమేష్, దాసరి వీరయ్య, జల్ల ప్రవీణ్ ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎస్సైతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


