స్వప్న హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం!
ఫిర్యాదులిచ్చినా పట్టించుకోని పోలీసులు
హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగిన మహిళా నేరాలు
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి
ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి శిక్ష విధించాలి
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ
కాకతీయ, మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న కుటుంబ సభ్యులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. స్వప్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లాయర్‌గా పనిచేస్తున్న స్వప్న త్వరలోనే పెళ్లి చేసుకోవాలని భావించిందని, కానీ కుటుంబ సభ్యుల చేతిలోనే హత్యకు గురికావడం అత్యంత బాధాకరమని కవిత అన్నారు. ఇంత దారుణ ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. స్వప్న తనకు జరుగుతున్న వేధింపులపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని కవిత ఆరోపించారు. ఫిర్యాదులు ఇచ్చినప్పుడే పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఘోరం జరిగేదే కాదని ప్రజలంతా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదో పోలీసులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
పోలీసులంటే భయం లేకుండా పోయింది
హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోనే ఇలాంటి దారుణ ఘటన జరగడం అత్యంత ఆందోళనకరమని కవిత అన్నారు. అంటే నేరస్థులకు పోలీసులంటే భయం లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మహిళలపై నేరాలు తీవ్రమవుతున్నాయని, గన్‌తో బెదిరించి డబ్బులు దోచుకునే స్థాయికి పరిస్థితులు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని, పోలీసులకు కఠిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును పాస్ చేయాలి
హత్యకు గురైన స్వప్న ఒక న్యాయవాది అని గుర్తుచేస్తూ, లాయర్ల రక్షణ కోసం గతంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు సవరణలు చేసినప్పటికీ రెండేళ్లుగా ఆ బిల్లు పెండింగ్‌లో పెట్టారని కవిత విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ బిల్లును తక్షణమే ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి మూడు నెలలలోపు నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నలుగురు నిందితుల్లో ఒకరిపై గతంలోనే హత్యాయత్నం కేసు ఉన్నప్పటికీ కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి దారుణం జరిగిందని పేర్కొన్నారు. నిందితులకు త్వరితగతిన శిక్షపడకపోతే నేరస్థులకు భయం ఉండదని హెచ్చరించారు. స్వప్న కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉన్నారని, ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేయాలని డిమాండ్ చేశారు


