జంపన్నవాగు పనుల్లో గుట్టు రట్టు కావాల్సిందే!
ప్రతి జాతరకు ఒకే కాంట్రాక్టర్‌కు కోట్ల టెండర్లు
పాత సామగ్రితో కొత్త పనులంటూ గోల్మాల్..!
విరాళంగా వచ్చిన మోటార్ల వినియోగంపై అనుమానాలు
సమగ్ర విచారణ జరపాలని భక్తుల డిమాండ్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా జంపన్నవాగు పరిసరాల్లో జరిగే అభివృద్ధి పనులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి జాతరలో కోట్ల రూపాయల విలువైన టెండర్ పనులు ఒకే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం వెనుక అధికారులతో కుమ్మక్కు వ్యవహారం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే అనుమానాలు భక్తులు, స్థానికుల్లో రోజురోజుకు పెరుగుతున్నాయి. జంపన్నవాగులో ఇసుక లెవెలింగ్, స్నాన ఘట్టాలకు నీటి సరఫరా, బట్టలు మార్చుకునే గదుల నిర్మాణం, తాత్కాలిక వసతుల ఏర్పాటు వంటి ప్రధాన పనులన్నీ ప్రతిసారి ఒకే కాంట్రాక్టర్‌కే అప్పగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని, ముందుగానే కాంట్రాక్టర్‌ను ఖరారు చేసి తూతూమంత్రంగా టెండర్లు నిర్వహిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతి సారి అదే తంతు
ఒకసారి కొనుగోలు చేసిన పరికరాలను జాతర ముగిసిన తర్వాత భద్రపరిచి, తదుపరి జాతరలో మళ్లీ వాటినే వినియోగిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రతి జాతరకు టెండర్ అంచనా మాత్రం కోట్లలో పెరుగుతుండటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాత సామగ్రికి కేవలం రంగులు వేసి కొత్త పనులుగా చూపిస్తూ ప్రభుత్వ సొమ్ము కాజేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ప్రతిసారి కోట్ల రూపాయల వ్యయంతో కొత్త పనులు చేసినట్టు బిల్లులు చూపించడం వెనుక పెద్ద స్థాయి అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర కాంట్రాక్టర్లకు అవకాశం ఇవ్వకుండా ఒకే వ్యక్తికి పనులు కట్టబెట్టడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు.

విరాళ మోటార్లపై వివాదం
గత జాతర సందర్భంగా సిఆర్ఐ మోటార్స్ సంస్థ భక్తుల సౌకర్యార్థం జంపన్నవాగులో వినియోగం కోసం మోటార్లను విరాళంగా అందజేసింది. ఆ మోటార్లు అధికారుల ఆధీనంలో ఉండాల్సి ఉండగా, అవి కాంట్రాక్టర్ వద్దే ఉండి మళ్లీ కాంట్రాక్ట్ పనుల్లో వాటినే ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విరాళంగా వచ్చిన సామగ్రిని కాంట్రాక్టర్ తన స్వంత ఆస్తిలా వాడుకోవడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు–కాంట్రాక్టర్‌కు మధ్య ఉన్న అనుబంధానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి జాతర సమయంలో కొద్ది రోజుల పనికి కోట్ల రూపాయల బిల్లులు ఎలా చెల్లిస్తున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మహా జాతర 31వ తేదీతో ముగిసిన అనంతరం కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన పరికరాలను తొలగించి మళ్లీ భద్రపరచే పనులు ప్రారంభించాడని తెలుస్తోంది. తదుపరి జాతరలోనూ ఇదే సామగ్రిని మళ్లీ ఉపయోగించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. అయినా కొత్త టెండర్ల పేరుతో భారీ మొత్తాలు చెల్లించడం వెనుక అసలు రహస్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అధికారులకు ‘పర్సంటేజీ’ ఆరోపణలు
జాతర పనుల కేటాయింపుల్లో అధికారులకు పర్సంటేజీల రూపంలో లావాదేవీలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు అధికారులకు ప్రత్యేక విందులు, వినోదాల ఏర్పాట్లు చేయడం, ప్రశ్నించిన వారికి డబ్బులు పంపిణీ చేయడం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మీడియా ప్రతినిధులకూ ‘కవర్లు’ అందజేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంపన్నవాగు పరిసరాల్లో జరిగే టెండర్ ప్రక్రియలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు పారదర్శకంగా ఖర్చు అవుతున్నాయా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని, అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. జాతర పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి వ్యవహారాలను వెంటనే అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.



