బండి సంజయ్‌కు తపాలా ఉద్యోగుల వినతి
కాకతీయ, జమ్మికుంట: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సి రాష్ట్ర నాయకులు యూ. మహేందర్ కలిసి కీలక వినతి పత్రం అందజేశారు. జమ్మికుంట పర్యటనకు వచ్చిన సందర్భంగా మహేందర్ ఆయన్ను కలిసి తపాలా ఉద్యోగుల సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదో వేతన కమిటీని త్వరితగతిన అమలు చేయాలని, మధ్యంతర భృతిని 20 శాతం వరకు పెంచాలని కోరినట్లు తెలిపారు. అలాగే గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగులను ఎనిమిదో వేతన కమిటీ పరిధిలోకి తీసుకుని, వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
కేంద్ర ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని కూడా బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు మహేందర్ వెల్లడించారు.


