చైర్మన్ పీఠం బీజేపీకి అప్పగించండి!
కాంగ్రెస్‌కు ఓటేస్తే పన్నుల మోత ఖాయం
ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా
నాయిని చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తా
జమ్మికుంట రూపురేఖలు మార్చే బాధ్యత నాది
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, జమ్మికుంట : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఆ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే ఇంటి పన్ను, నల్లా పన్ను, వ్యాపార పన్నుల పెంపు ఖాయమని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, బీజేపీకి మున్సిపాలిటీలను అప్పగిస్తే పన్నుల భారం లేకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జ్ ఎర్రం మహేశ్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఎన్నిసార్లు గెలిపించినా పట్టణానికి రూపాయి కూడా రాలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ మీద కోపంతో కాంగ్రెస్‌కు ఓట్లు వేసినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మహిళలకు రూ.2500, తులం బంగారం, స్కూటీలు వంటి హామీలను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జమ్మికుంట మున్సిపాలిటీకి ఏమిచ్చారని ప్రశ్నిస్తూ, చివరకు ఇచ్చింది “గాడిద గుడ్డే” అని ఎద్దేవా చేశారు.
కేంద్ర నిధులతోనే పట్టణాభివృద్ధి
జమ్మికుంట మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చామని బండి సంజయ్ వివరించారు. 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.8 కోట్ల 23 లక్షలు, అమృత్ పథకం ద్వారా రూ.33 కోట్లు, స్వనిధి పథకం ద్వారా 4,587 మందికి రూ.8 కోట్ల 45 లక్షలు అందించామని తెలిపారు. ఖేలో ఇండియా పథకం ద్వారా సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ కోసం రూ.6 కోట్ల 50 లక్షలు మంజూరు చేయించామని, ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించామని గుర్తుచేశారు. సీఎస్సార్, ఎంపీ ల్యాడ్స్ నిధులతో కోట్ల రూపాయలు తీసుకొచ్చి జమ్మికుంట ఆసుపత్రికి మెడికల్ ఎక్విప్‌మెంట్ సమకూర్చామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డాక్టర్లు, సిబ్బందిని నియమించకుండా బాధ్యతను విస్మరించిందని ఆరోపించారు. నేడు మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. బీజేపీకి మున్సిపల్ చైర్మన్ పీఠం అప్పగిస్తే జమ్మికుంట రూపురేఖలనే మార్చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. నాయిని చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి బోటింగ్ సదుపాయం కల్పిస్తానని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. పట్టణ ప్రజల ఆస్తుల విలువ పెరిగేలా సమగ్ర అభివృద్ధి చేపడతానన్నారు.
జమ్మికుంటను సుందర పట్టణంగా మారుస్తా
జమ్మికుంటను వ్యాపార, కూరగాయల హబ్‌గా అభివృద్ధి చేస్తానని, అన్ని వార్డుల్లో అంతర్గత రోడ్లు నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో మురుగు నీటి సమస్య తలెత్తకుండా శాశ్వత ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడతానన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తానని, పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ మోసపు హామీలు ఇవ్వదని, నిజాయితీతో పని చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాటలు నమ్మి ప్రజలు ఇప్పటికే మోసపోయారని, మళ్లీ పొరపాటు చేస్తే పరిస్థితులు మరింత దారుణమవుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే పన్నుల భారమే తప్ప అభివృద్ధి ఉండదన్నారు. నిధులు తెచ్చి నిజమైన అభివృద్ధి చేయగల శక్తి బీజేపీకే ఉందని, ఈసారి జమ్మికుంట మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించాలని ప్రజలను కోరారు. ఒక్క అవకాశం ఇస్తే పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని బండి సంజయ్ హామీ ఇచ్చారు


