ప్రజాధనంతో ప్రచారం
సీఎం రేవంత్‌పై ఈసీకి జాగృతి నేతల ఫిర్యాదు
ప్రభుత్వ వేదికపై కాంగ్రెస్‌కు ఓటేయమని ప్రచారం
ఎన్నికల నియమావళి ఉల్లంఘన చేశారు
ఫిర్యాదులో పేర్కొన్న జాగృతి నేతలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ జాగృతి నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్సింగ్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ లింగ్యా నాయక్‌కు ఫిర్యాదు లేఖను జాగృతి నేతలు అందజేశారు. సీఎం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని వారు ఆరోపించారు. రూప్సింగ్ మాట్లాడుతూ… మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని ప్రజలను కోరడం పూర్తిగా ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు. పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన సీఎం, ప్రభుత్వ వేదికను ఉపయోగించుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సీఎం ఇదే విధంగా నిబంధనలు ఉల్లంఘించారని, అప్పుడు తమ సంస్థ అధ్యక్షురాలు కవిత స్వయంగా ఈసీని కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రూప్సింగ్ గుర్తుచేశారు. ఈసారి మాత్రం ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చిందని తెలిపారు. సీఎస్‌కు లేఖ రాసి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ చెప్పినట్లు వెల్లడించారు.
నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు
జాగృతి సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సీఎం ఇదే ధోరణి కొనసాగిస్తున్నారని, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఆయన యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. టీఎన్ శేషన్ రూపొందించిన ఎన్నికల నియమావళిని అమలు చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని, కానీ నిబంధనలను పక్కనపెట్టి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కనుసన్నుల్లో కాకుండా ఈసీ కనుసన్నుల్లో ఎన్నికలు జరగాలని, బాధ్యతాయుత పదవిలో ఉన్న సీఎం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
జాగృతి నాయకుడు నరేష్ ప్రజాపతి మాట్లాడుతూ, ప్రజాపాలన అని చెప్పే సీఎం ప్రజలను పూర్తిగా గాలికి వదిలేశారని, ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికల ప్రచారం చేస్తూ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని, ఈసారి మాత్రం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న తప్పిదాలను ప్రజలకు వివరించి ఆయన తీరును ఎండగడతామని, ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
ఈసీకి ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి సీనియర్ నాయకులు కోల శ్రీనివాస్, నరేందర్ యాదవ్, మరిపెల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.


