కాంగ్రెస్‌కు ఓటమి భయం..!
అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం
వ్యవస్థలన్నీ సమగ్రంగా పనిచేస్తేనే గ్రామ స్వరాజ్యం
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఓ చీకటి అధ్యాయం
ప్రశ్నించే వారికి సోషల్ మీడియా ఓ మంచి వేదిక… ఆయుధం
ఆ ఆయుధాన్ని సొంత పార్టీలోనే విభజనక వాడొద్దు
మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలంటేనే భయం పట్టుకుంటోందని మల్కాజిగిరి ఎంపీ, బీజీపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే రెండేళ్లు కావస్తున్నా.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. మునిసిపాలిటీ, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు పాలక వర్గాలు లేక పరిపాలన ఆగమాగంగా ఉందని అన్నారు. వ్యవస్థలన్నీ సమగ్రంగా..సమర్థవంతంగా పనిచేస్తేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని అన్నారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ సోషల్ మీడియా మరియు ఐటీ మరియు సోషల్ మీడియా వర్క్ షాప్‌లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయమని, ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు బీఆర్ ఎస్ చీకటి పాలనను మరిచిపోవడం లేదన్నారు.
కేంద్రం నిధులతోనే గ్రామాభివృద్ధి..!
“సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది” అన్నట్లు, కేంద్రం ఇచ్చిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ తమవిగా చెప్పుకుంటున్నాయని ఈటల అన్నారు. గ్రామాల్లో రోడ్లు, శ్మశానవాటికలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణమయ్యాయని తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయన్నారు. అందుకే అభివృద్ధి కొనసాగాలంటే, రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయాలనీ మీరందరూ గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరుతున్నాని తెలిపారు.
సోషల్ మీడియా పాత్ర చాలా ముఖ్యమైంది..
నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియా ఒక గొప్ప ఫ్లాట్‌ఫాం అని ఈటల రాజేందర్ అన్నారు. అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది కూడా సోషల్ మీడియానేనని అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి.. వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి.. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే యోధులని అన్నారు. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ లాంటిది.. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప, మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదంటూ హితవు పలికారు. సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్, వారి మెదడు ఎఫెక్టివ్‌గా పనిచేస్తేనే ఫలితం సమర్థవంతంగా ఉంటుందన్నారు.


