పోలింగ్ సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్ పూర్తి
నర్సంపేట–వర్ధన్నపేట ఎన్నికలకు 400 మంది సిబ్బంది కేటాయింపు
పారదర్శక పోలింగ్‌కు స్థానికేతర సిబ్బంది ఎంపిక
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో పోలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను బుధవారం కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జనరల్ అబ్జర్వర్ కిల్లు శివకుమార్ నాయుడు సమక్షంలో ఈ ప్రక్రియ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ర్యాండమైజేషన్ నిర్వహించగా, కలెక్టర్, జనరల్ అబ్జర్వర్‌లు నిశితంగా పరిశీలించారు. నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు రెండో ర్యాండమైజేషన్ ద్వారా మొత్తం 80 మంది ప్రిసైడింగ్ అధికారులు, 80 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 240 మంది ఇతర పోలింగ్ అధికారులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తిస్థాయిలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు స్థానికేతర సిబ్బందినే పోలింగ్ విధుల కోసం ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ, లాజిస్టిక్ సపోర్ట్ కూడా ముందుగానే అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశాన్ని పక్కాగా అమలు చేస్తూ, పోలింగ్ కేంద్రాల భద్రత, సిబ్బంది సమన్వయం, ఓటర్ల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎన్నికల ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, ఎక్కడా లోపాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, ఆర్డీఓ సుమ, డీపీఓ కల్పన, డీబీసీడీఓ పుష్పలతతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


