మేడారం వెళ్తుండగా వాహనం బోల్తా
ఐదుగురికి తీవ్ర గాయాలు
కాకతీయ, ఏటూరునాగారం : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తుల వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి భక్తులతో మేడారానికి వెళ్తున్న వాహనం తాడ్వాయి మండల కేంద్రం దాటిన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వాహనాన్ని నియంత్రించలేకపోవడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో సుమారు పదిమందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సంఘటనపై తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడారం జాతర రద్దీ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర మలుపుల వద్ద వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.


