కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డాయి..
పార్టీని, ప్రభుత్వాన్ని జనం మడత పెట్టేస్తారు
తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే గెలుపు మాదే
బై ఎలక్షన్లు వస్తున్నాయి.. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో భయం
ఫిరాయింపు ఎమ్మెల్యేలు దమ్ముంటే కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలి
శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని, జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం చాతగానిదని, ముందు చూపులేనిదని జనాలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు మడత పెట్టడం ఖాయమని అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియాపూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్‌పై, తనపై కేసులు తప్పా 20నెలల్లో రేవంత్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సొంత ఆస్తులు, భూములు పెంచుకోవటానికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి పోయారని విమర్శించారు.
దమ్ముంటే కాంగ్రెస్ గుర్తు పోటీచేయాలే..!
రాష్ట్రంలో త్వరలోనే బై ఎలక్షన్లు రాబోతున్నాయని కేటీఆర్ అన్నారు. బై ఎలక్షన్లు రావడం ఖాయమని తేలిపోగా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో వణుకు పుడుతోందన్నారు. అంత నిజాయితీగా ఉంటే ఎందుకు భయం అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆ పార్టీ గుర్తుపైనే పోటీ చేసి గెలవాలంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ఎవరూ గెలుస్తారో చూసుకుందామని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి, కేసీఆర్ గెలుస్తారో ప్రజలే తేలుస్తారని పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్లినా.. కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలబడ్డారని చెప్పుకొచ్చారు.
హైడ్రా పేరుతో అరాచకం
ఎంతో ముందు చూపుతో పదేళ్లలో కేసీఆర్ హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు గుండెకాయగా కేసీఆర్ చేశారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సన్నాసి పనుల వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. హైడ్రా పేరుతో అరాచకాలు చేయడం మొదలు పెట్టిందన్నారు. ఎంతోమంది పేదలను ఇళ్లను కూల్చి..రోడ్డు పాలు చేసిందన్నారు. పేదల ఇళ్లను కూల్చిన ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు దుర్గం చెరువులోని సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు కూల్చే దమ్ము ఉందా? అంటూ హైడ్రాకు కేటీఆర్ సవాల్ విసిరారు. అంటే పేదోలపైనేనా..మీ ప్రతాపం.. సామాన్యుడిని రోడ్డు పాలు చేసి..పెద్దల అక్రమాలకు వత్తాసు పలుకుతోంది హైడ్రా అంటూ మండిపడ్డారు. హైడ్రా.. కాంగ్రెస్ నాయకుల దందాలకే పనికొస్తోందని ఆరోపించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల దగ్గర ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్‌కు గ్రేటర్ హైదరాబాద్ కంచుకోట
గ్రేటర్ హైదరాబాద్ నగరం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం అనేక ఎన్నికల్లో రుజువైందని పేర్కొన్నారు. సొంత ఆస్తులు, భూములు పెంచుకోవటానికే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు.కొంతమంది నాయకులు పార్టీని స్వార్థప్రయోజనాల కోసం వీడినా..నాయకులు, కార్యకర్తలు మాత్రం గులాబీ పార్టీకి దండుగా నిలిచారన్నారు. పార్టీకోసం పనిచేసిన వారందరికి అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ కార్యకర్తలకు నేతలకు హామీ ఇచ్చారు.


