బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటెయ్యండి
మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్
కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలో జరిగిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1, 11, 12, 13 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే హుస్నాబాద్ పట్టణం సమగ్రంగా అభివృద్ధి చెందిందని, రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు మెరుగుపడ్డాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టణంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీలేదని, కేవలం శంకుస్థాపనలతోనే కాలం గడిపేస్తోందని మండిపడ్డారు. “బీఆర్‌ఎస్ పాలనలోనే పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాం. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు కావస్తున్నా పింఛన్లు పెంచలేదు. రైతులు, వృద్ధులు, మహిళల సమస్యలను పట్టించుకోవడం లేదు” అని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం కావాలంటే, పింఛన్లు పెరగాలంటే, హుస్నాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తే సరైన ఎంపిక అని స్పష్టం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, వృద్ధులు పాల్గొని బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


