నాగుర్లకు ఘన స్వాగతం..
వరంగల్‌లో ఫర్టిలైజర్స్ డీలర్ల సన్మానం
20 ఏళ్ల సేవలకు గుర్తింపుగా డీలర్ల గౌరవం..
రైతులుడీలర్ల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తాం..
డీలర్ల సమష్టి కృషితోనే ఈ స్థానం
రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు..
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నాగుర్ల వెంకటేశ్వర్లు (నవత వెంకన్న)కు ఉమ్మడి వరంగల్ జిల్లా ఫర్టిలైజర్స్ అసోసియేషన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా వరంగల్‌కు వచ్చిన సందర్భంగా నాయకులు టపాసులు పేల్చి సంబురాలు చేపట్టారు. అనంతరం పూల బొకేలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసే సమయంలో ప్రతి డీలర్ తన వెన్నంటే నిలిచి కుటుంబ సభ్యుల్లా ప్రోత్సహించారని తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి ప్రతి డీలర్ తన నిర్ణయాలను గౌరవిస్తూ సహకారం అందించారని గుర్తు చేశారు. అందరి సమష్టి కృషితోనే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు గాయత్రి రామచంద్రారెడ్డి, లాహోటి శ్రీనివాస్, అచ్చ పరమేశ్వర్, పోలిమెట్ల రమేష్ బాబు, పల్లె రాజేందర్ రెడ్డి, ఆకుల హరేందర్, దేసు ప్రవీణ్, బజ్జూరి సతీష్, అమ్మ జగన్ పాల్గొన్నారు.


