బర్త్‌డే పేరుతో బీభత్సం నడి రోడ్డుపై తల్వార్ తో హంగామా
యువకులపై దాడి చేసి డబ్బులు లూటీ 9 మంది అరెస్ట్
రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : బర్త్‌డే వేడుక పేరుతో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించిన రౌడీ బ్యాచ్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తల్వార్‌తో కేక్ కట్ చేయడం, బాణాసంచా కాల్చడం ద్వారా స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, ఇద్దరు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసి డబ్బులు, మొబైల్ ఫోన్లు లాక్కున్న ఘటనలో మొత్తం 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 31 అర్థరాత్రి 12 గంటల సమయంలో కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్‌లో ఓ మైనర్‌కు సంబంధించిన బర్త్‌డే వేడుకను నడి రోడ్డుపై నిర్వహించారు. కారుపైకి ఎక్కి తల్వార్‌తో కేక్ కట్ చేయడంతో పాటు బాణాసంచా కాల్చి ప్రజలను భయాందోళనకు గురిచేశారు.
అదే సమయంలో రేకుర్తిలోని సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించిన టెంట్లను వాహనంలో తరలిస్తున్న యుగంధర్, చరణ్‌లు అక్కడికి చేరుకున్నారు. టెంట్లు దింపుతుండగా బర్త్‌డే పార్టీ నిర్వహిస్తున్న వారిని గమనించిన రౌడీ బ్యాచ్, బూతులు తిడుతూ చరణ్‌పై దాడికి దిగింది. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన యుగంధర్‌పై కర్రలు, బండలతో దాడి చేశారు.
డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి, చరణ్ వద్ద ఉన్న రూ.2 వేల నగదు, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. యుగంధర్ మొబైల్ ఫోన్‌ను నేలకేసి కొట్టడంతో అది పూర్తిగా ధ్వంసమైంది. రెండు మొబైల్ ఫోన్ల విలువ సుమారు రూ.40 వేల వరకు ఉంటుందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.స్థానికులు జోక్యం చేసుకుని బాధితులను ఆసుపత్రికి తరలించగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మేజర్లు,వాలకుంట్ల అజయ్, ముక్కెర విఘ్నేష్, గుంజ రంజిత్‌లను అరెస్ట్ చేయగా, మరో ఆరుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


