గ్రామస్థాయి ప్రతిభకు వేదికగా సీఎం కప్ పోటీలు
నల్లబెల్లిలో ఉత్సాహంగా మండల స్థాయి క్రీడా సంబరాలు
కాకతీయ, నల్లబెల్లి: గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కప్ మండల స్థాయి క్రీడా పోటీలు సోమవారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలోని కాకతీయ బ్రిలియంట్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. గ్రామ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ మండల స్థాయి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించగా విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో తమ ప్రతిభను ప్రదర్శించారు. చదువుతో పాటు క్రీడల ప్రాధాన్యతను తెలియజేసేలా ఈ పోటీలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడం, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే సీఎం కప్ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి తహసీల్దార్ ఎం.కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లోనూ రాణించి భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మండల విద్యాధికారి అనురాధ విద్యార్థులకు క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో కాకతీయ బ్రిలియంట్ హైస్కూల్ డైరెక్టర్ రామారావు, ప్రధానోపాధ్యాయుడు రణధీర్ రెడ్డి, శారీరక విద్య ఉపాధ్యాయులు రవీందర్, దేవీలాల్, రుద్రగూడెం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు లక్ష్మి, సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.


