సెట్టిల్‌మెంట్ డబ్బుల వివాదం
పోలీస్‌స్టేషన్ ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం
కాకతీయ, హుజురాబాద్ : విడాకుల సమయంలో ఒప్పుకున్న సెటిల్‌మెంట్ డబ్బులు భర్త ఇవ్వకపోవడం, పోలీసుల నుంచి న్యాయం అందలేదన్న ఆవేదనతో ఓ వివాహిత పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన పోలీసులు, స్థానికుల చొరవతో ప్రమాదం తప్పింది.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం తిగారం గ్రామానికి చెందిన గండ్రకోట జంపయ్య, మహాలక్ష్మి దంపతుల కుమార్తె పావనికి, హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కుంచపు అరవింద్‌తో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు మొదలవడంతో పావని హుజురాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.
తరువాత పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోగా, సెటిల్‌మెంట్ కింద పావనికి రూ.9 లక్షలు చెల్లించేందుకు భర్త అంగీకరించాడు. అయితే ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు ఇబ్బందులు పెడుతున్నాడని ఆమె ఆరోపించింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని తెలిపింది.మంగళవారం తల్లిదండ్రులతో కలిసి ముందుగా పోలీస్ స్టేషన్ ఎదుట, అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన తెలిపింది. అరగంటకు పైగా సాగిన ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. మనస్తాపానికి గురైన పావని వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు అడ్డుకుని ఆమెను స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.


