వైద్య బృందానికి డీఎంహెచ్ఓ అభినందనలు
కాకతీయ, ఆత్మకూరు : అగ్రంపహాడ్ సమ్మక్క–సారాలమ్మ జాతరకు వచ్చిన భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు, సిబ్బంది పని భేష్ అని హనుమకొండ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య ప్రశంసించారు. ఆదివారం ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్‌లో నాలుగు రోజుల పాటు 24 గంటలు నిరంతరంగా వైద్య సేవలు అందించిన వైద్య బృందాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, జాతర కాలంలో మూడు షిఫ్టులలో మొత్తం 4,452 మంది ఔట్‌పేషెంట్లకు వైద్య సేవలు అందించామని తెలిపారు. అలాగే 67 మందిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, గాయపడిన 24 మందికి కుట్లు వేసినట్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స అవసరమైన 8 మందిని ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి పర్యవేక్షణలో మండల వైద్యాధికారి డాక్టర్ స్పందన, అక్కంపేట వైద్యులు డాక్టర్ నర్సింగరావు, డాక్టర్ పుష్పలీలతో పాటు తొమ్మిది మంది వైద్యుల బృందం సేవలందించిందన్నారు. అలాగే డీఈఎంఓ అశోక్ రెడ్డి, సీహెచ్ఓ మాధవరెడ్డి, నర్సులు, ఎంపీహెచ్ఏలు, పారామెడికల్ సిబ్బంది కలిపి 60 మంది బృందం నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ద్వారా 3,200 మందికి చికిత్స అందించినట్లు వివరించారు. జాతర సందర్భంగా 108 అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండి అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సకాలంలో సహాయం అందించాయని డీఎంహెచ్ఓ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య బృందం సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని పేర్కొన్నారు.


