దళితులను నిలువెత్తున మోసం చేశాడు
కేసీఆర్‌పై పరకాల ఎమ్మెల్యే రేవూరి విమర్శలు
పరకాలలో దళిత వాడలు మోడల్ కాలనీలు
దళిత సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబాటుకు హామీ
కాకతీయ, పరకాల : దళిత ముఖ్యమంత్రి చేస్తానని, తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానని చెప్పిన కేసీఆర్ చివరకు దళితులను నిలువెత్తున మోసం చేశాడని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పరకాల పట్టణ కేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన మాదిగ కుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ, దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దళితులు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ వెంటే నిలిచారని, వారి అభ్యున్నతి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గడిచిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో దళితుల పాత్ర కీలకమైందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సోనియా గాంధీ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారమే ప్రజా ప్రభుత్వంగా దళితులకు న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. పరకాల పట్టణంలోని దళిత వాడలను తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతులతో మోడల్ కాలనీలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలోనే దళితులకు నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాదిగ సంఘ నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో దళిత ప్రజలు పాల్గొన్నారు.


