మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలి
కరీంనగర్‌లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపు
కాకతీయ, కరీంనగర్ : నగర అభివృద్ధి జరగాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అల్ఫోర్స్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్లతో కలిసి నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అదే విశ్వాసం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంగా మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమవుతోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన వసతులు కల్పిస్తోందని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కరీంనగర్ నగరంలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ ఘన విజయం సాధించేందుకు సహకరించాలని కోరారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ విజయం ఖాయమని, రాష్ట్రవ్యాప్తంగా కూడా పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, విఎన్ఆర్ ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.


