బీసీ హాస్టల్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం!
కూలిన కాంపౌండ్ వాల్… పట్టించుకోని అధికారులు
చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలు ఉధృతం: ఎస్ఎఫ్ఐ హెచ్చరిక
కాకతీయ, ఏటూరునాగారం : నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్‌లో వర్షాకాలంలో కాంపౌండ్ వాల్ కూలిపోయినప్పటికీ, విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ ఆరోపించారు. హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడి విద్యార్థులపై పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదకర పరిస్థితులపై విద్యార్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ విద్యార్థుల భద్రతను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాకు పంచాయతీ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు హాస్టల్ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టి, అవసరమైన సదుపాయాలు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


