పరకాలకు పూర్వ వైభవం తీసుకొస్తా
పట్టణాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తాం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం
కాకతీయ, పరకాల : చారిత్రాత్మకమైన పరకాల పట్టణానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. పరకాల పట్టణ కేంద్రంలోని పద్మశాలి భవన్‌లో నిర్వహించిన పద్మశాలి కులస్తుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ భక్త మార్కండేయ, కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరకాల శాసన సభ్యుడిగా తనను గెలిపించడంలో పద్మశాలి కులస్తులది క్రియాశీలక పాత్ర అని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన పద్మశాలి సోదరులు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధమైన సహకారం అందించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని పరకాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అభివృద్ధికి ప్రత్యేక డీపీఆర్
పరకాల పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక డీపీఆర్ రూపొందించి మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టణాన్ని పూర్తిస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ దిశగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, టాస్క్ సెంటర్ల ఏర్పాటు జరుగుతోందని వివరించారు. పరకాల అభివృద్ధి ప్రణాళికలు విజయవంతం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు మరింత బలపడాలని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పద్మశాలి సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


