వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు
కేసీఆర్‌కు సిట్ నోటీసులపై బిఆర్ఎస్ ఆగ్రహం
కొనాయిమాకుల వద్ద రాస్తారోకో
కాకతీయ, గీసుగొండ : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి *కేసీఆర్*కు సిట్ నోటీసులు జారీ చేస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన చర్యను ఖండిస్తూ గీసుగొండ మండలంలోని కొనాయిమాకుల క్రాస్ రోడ్ వద్ద వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై బిఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడైన కేసీఆర్‌పై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు, సిట్ నోటీసుల పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, తన అసమర్థతను దాచిపెట్టేందుకు కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బిఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణిచివేయాలన్న ప్రయత్నాలు సహించబోమని స్పష్టం చేశారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, చల్ల వేణుగోపాల్ రెడ్డి, బోడకుంట్ల ప్రకాష్, ముంత రాజయ్య, జక్కు మురళి, యూత్ నాయకులు శిరీసే శ్రీకాంత్, కోట ప్రమోద్, మంద రాజేందర్, గోనె నాగరాజుతో పాటు పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.


