మేడారంలో మరుగుదొడ్ల వద్ద అరిగోస..!
అక్కడ కూడా చేయి చాపుతున్న వైనం
ఉచిత మరుగుదొడ్ల కాడ అనధికారికంగా వసూళ్లు
రూ.10నుంచి 20 వరకు ఇవ్వాల్సిందేనంట
దుర్గంధంతో అల్లాడిపోతున్న భక్తులు
కాకతీయ, మేడారం బృందం : మేడారం మహా జాతరలో భక్తులు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరలో ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరుగుదొడ్ల నిర్వహణ భక్తులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం ఉచితంగా వినియోగించుకోవాలని ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్ల వద్ద కొందరు అనధికార వ్యక్తులు బహిరంగంగా వసూళ్లకు పాల్పడుతున్నారని భక్తులు వాపోతున్నారు. ఒక్కసారి వినియోగించాలంటే రూ.10 నుంచి రూ.20 వరకు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవ్వకపోతే లోపలికి అనుమతించకపోవడం, మాటల దురుసుతనం ప్రదర్శించడం జరుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుర్గంధం–అపరిశుభ్రతతో అవస్థలు
జాతర సందర్భంగా దాదాపు 5,700 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, భక్తుల రద్దీకి తగినట్లుగా శుభ్రపరిచే చర్యలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చాలాచోట్ల మరుగుదొడ్ల చుట్టూ దుర్వాసనతో భక్తులు నిలబడలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరుగుదొడ్లలో అవసరమైన నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. నీరు లేకపోవడంతో వినియోగం తర్వాత శుభ్రత పాటించడం కష్టంగా మారిందని భక్తులు చెబుతున్నారు. ఈ కారణంగా మరుగుదొడ్లలో అపరిశుభ్రత మరింత పెరుగుతోందని స్థానికులు అంటున్నారు.

సిబ్బంది ఉన్నా కనిపించని నిర్వహణ
జాతర నిర్వహణకు 5,000 నుంచి 9,000 మంది పారిశుధ్య సిబ్బందిని మోహరించామని, 526 మంది సూపర్వైజర్లతో 25 సెక్టార్లలో పర్యవేక్షణ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ జాతర లోపలి ప్రాంతాల్లో వ్యర్థాల తొలగింపు, మరుగుదొడ్ల శుభ్రత సకాలంలో జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కాగితాలకే పరిమితమైందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవిత్రమైన వనదేవతల జాతరకు వచ్చి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉచిత సౌకర్యాల పేరుతో అక్రమ వసూళ్లు అరికట్టాలని, మరుగుదొడ్ల నిర్వహణను తక్షణమే మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే జాతర స్థాయికి తగిన ఏర్పాట్లు లేవన్న విమర్శలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


