డొక్కు స్కూటర్ నుంచి కోట్ల భవంతుల ఎలా..?
సునీల్ రావు అవినీతి చరిత్ర బయటపెడతాం
స్మార్ట్ సిటీ పేరిట వందల కోట్ల దోపిడీ
కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
42వ డివిజన్లో డాక్టర్ రాజన్న నామినేషన్‌కు భారీ ర్యాలీ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర రాజకీయాల్లో ఎన్నికల వేళ మరోసారి తీవ్ర వేడి పుట్టింది. మాజీ మేయర్ సునీల్ రావుపై కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఒకప్పుడు డొక్కు స్కూటర్‌పై తిరిగిన సునీల్ రావు స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పేరిట వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి తెలంగాణలో ఏ నేతకూ లేని విధంగా అత్యాధునిక భవంతులు నిర్మించుకున్నాడని మండిపడ్డారు. సునీల్ రావు మేయర్‌గా ఉన్న కాలంలో అభివృద్ధి పనుల ముసుగులో కరీంనగర్ ప్రజలను దోచుకున్నారని రాజేందర్ రావు ఆరోపించారు. బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, దుకాణాల నిర్మాణాల్లో దౌర్జన్యంగా వసూళ్లు జరిగాయని కోట్ల రూపాయలు స్వాహా చేశారన్న విమర్శలు గుప్పించారు. ఈ అవినీతి బాగోతం నగర ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.
42వ డివిజన్లో భారీ ర్యాలీ
శుక్రవారం కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్ భగత్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రాజన్న నామినేషన్ దాఖలు సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ నిజాయితీగా ప్రభుత్వాధికారిగా సేవలందించిన డాక్టర్ రాజన్నకు ప్రజలు ఆశీర్వాదం ఇస్తే డివిజన్‌కు స్వచ్ఛమైన, బాధ్యతాయుత పాలన వస్తుందని అన్నారు. అవినీతిపై ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పోరు కాదని నిజాయితీ వర్సెస్ అవినీతి మధ్య జరుగుతున్న సమరమని వ్యాఖ్యానించారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు దిగడం రాజకీయ విలువలకు విరుద్ధమని రాజేందర్ రావు తీవ్రంగా విమర్శించారు. కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని చేసే విమర్శలు తగవని ప్రజల ముందు నిజాలు త్వరలోనే బయటపడతాయని స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి అవినీతిని ప్రజలు తిరస్కరించి నైతిక రాజకీయాలకు మద్దతు ఇవ్వాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


