మేడారం దర్శనానికి వెళ్లి వస్తూ విషాదం
మహదేవపూర్–కాళేశ్వరం రహదారిపై బొలెరో–లారీ ఢీ
ఐదుగురికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
జయశంకర్ భూపాలపల్లి : మహదేవపూర్–కాళేశ్వరం ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం నుంచి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తున్న బొలెరో వాహనాన్ని లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ప్రకృతి వనం సమీపంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడినవారు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా చల్వాడ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మేడారంలో మొక్కులు చెల్లించుకున్న అనంతరం బొలెరో వాహనంలో తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. యూపీ నుంచి మహదేవపూర్ మీదుగా చెన్నైకి వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మహదేవపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


