ప్రభుత్వ పాఠశాలలో ‘సంస్థాగత’ గీతం
ఆలస్యంగా వెలుగులోకి ఘటన
సోషల్ మీడియాలో వైరల్..!
కాకతీయ, సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం మోడల్ స్కూల్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా.. విద్యార్థులు, సిబ్బంది సమక్షంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మైకు పట్టుకుని “సంఘటనం ఒక యజ్ఞం.. సమిధగా మన జీవనం” అనే గీతాన్ని ఆలపించారు. ఈ గీతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన శాఖల్లో పాడే ప్రార్థనా గీతంగా గుర్తింపు పొందింది. జాతీయ గీతం, వందేమాతరం లేదా ప్రభుత్వం ఆమోదించిన దేశభక్తి గేయాలను పాడాల్సిన చోట, ఒక నిర్దిష్ట సిద్ధాంతంతో కూడిన గీతాన్ని ఆలపించడంపై కొంతమంది ఆక్షేపిస్తున్నారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, ప్రభుత్వ వేదికపై ఒక సంస్థాగత గీతాన్ని పాడటం స్పష్టంగా నిబంధనల అతిక్రమణేనని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి లేదా మతపరమైన సంస్థలకు బాహాటంగా మద్దతు తెలపకూడదు. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్ ప్రకారం, పాఠశాల వంటి లౌకిక వేదికలపై ప్రైవేట్ అజెండాలను ప్రచారం చేయడం క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు అన్ని వర్గాలకు, మతాలకు ప్రాతినిధ్యం వహిస్తాయని, అక్కడ ఒక నిర్దిష్ట భావజాలాన్ని చొప్పించడం వల్ల విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఉద్యోగి కేవలం రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలని వారు గుర్తు చేస్తున్నారు. గీతాల ఎంపికలో ముందస్తు పరిశీలన లేకపోవడం పాఠశాల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.


