మేడారంలో మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న భక్తులు
జంపన్న వాగు వద్ద గంటకుపైగా నిలిచిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
సైరన్ శబ్దం, అనుచరుల అత్యుత్సాహంతో భక్తుల ఆగ్రహం
చివరికి కారు దిగి వెళ్లిపోయిన మంత్రి
కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతరలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కాన్వాయ్‌ను భక్తులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి సమ్మక్క ఆగమనం అనంతరం జరిగింది. మేడారంలోని జంపన్న వాగు వద్ద కిక్కిరిసిన భక్తుల మధ్య మంత్రి కాన్వాయ్ సైరన్‌తో వెళ్లేందుకు ప్రయత్నించడమే వివాదానికి దారి తీసింది. సమ్మక్క ఆగమనం అనంతరం అకస్మాత్తుగా కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఏర్పడిన గందరగోళం, భక్తుల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలో సైరన్ శబ్దానికి తోడు మంత్రి అనుచరుల అత్యుత్సాహం భక్తులను మరింత ఆగ్రహానికి గురిచేసిందని సమాచారం. ఫలితంగా కొందరు భక్తులు కాన్వాయ్‌ను అడ్డుకుని తెలుస్తోంది. ఆ సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భద్రతా కారణాలతో గంటసేపటికి పైగా కారులోనే ఉన్నట్టు తెలిసింది. పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో మహాజాతరలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


