అమ్మవారు అడిగిందా… అలిగిందా?
సారలమ్మ గద్దెకు చేరకముందే గేట్లు ఎందుకు తెరచారు?
భద్రతా కారణాలా… సంప్రదాయానికి భంగమా?
కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో బుధవారం రాత్రి చోటుచేసుకున్న పరిణామాలు భక్తుల్లో ఉత్కంఠను, తీవ్ర చర్చను రేపాయి. కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి గద్దెకు చేరుకునే కీలక ఘట్టంలో దర్శనాన్ని కొద్దిసేపు నిలిపివేయడం, ఆ తర్వాత మళ్లీ భక్తులను లోపలికి అనుమతించడం వెనుక కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సారలమ్మ గద్దెకు చేరుకునే వేళ మేడారం పరిసరాల్లో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. జంపన్నవాగు నుంచి గద్దెల ప్రాంగణం వరకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. ఈ నేపథ్యంలో తోపులాట, తొక్కిసలాట ప్రమాదం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు కొంతసేపు దర్శనాన్ని నిలిపివేశారు. అయితే గద్దెల ప్రాంగణం వెలుపల వేచి ఉన్న భక్తుల సంఖ్య మరింత పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సాంప్రదాయం ప్రకారం అమ్మవారు గద్దె ఎక్కిన తర్వాతే సాధారణ భక్తులకు దర్శనం ప్రారంభం కావాలి. కానీ ఈసారి సారలమ్మ గద్దెకు పూర్తిగా చేరకముందే గేట్లు తెరచి భక్తులను లోపలికి అనుమతించడం పట్ల గిరిజన పూజారులు, భక్తుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. “అమ్మవారు అడిగిందా… అలిగిందా?” అంటూ భక్తులు ఆధ్యాత్మికంగా ఆలోచనలో పడ్డారు. కొందరు ఇది సంప్రదాయానికి భంగమని భావిస్తే, మరికొందరు భక్తుల భద్రత కోసమే తీసుకున్న నిర్ణయమని సమర్థిస్తున్నారు.
భద్రతా చర్యలేనంటూ అధికారుల వివరణ..!
ఈ వ్యవహారంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందిస్తూ… ఇది పూర్తిగా భద్రతా చర్యేనని స్పష్టం చేశారు. గేట్లు తెరవకపోతే బయట తీవ్ర తోపులాట జరిగే ప్రమాదం ఉండేదని, ప్రాణనష్టం జరగకుండా చూడటానికే తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సంప్రదాయాలకు భంగం కలగకుండా పూజా కార్యక్రమాలు కొనసాగాయని అధికారులు వివరణ ఇచ్చారు. మొత్తానికి, మేడారం జాతరలో చోటుచేసుకున్న ఈ ఘటన భక్తి–భద్రత మధ్య సమతుల్యతపై మరోసారి చర్చకు తెరలేపింది. అమ్మవారి కటాక్షమే తుది నిర్ణయమని నమ్మే భక్తులు… అన్ని అనుకూలంగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు.


