బీసీ నాయకులపై అక్రమ కేసులు సిగ్గుచేటు
మణుగూరు సీఐ తీరు మార్చుకోవాలి
మండిపడ్డ బీసీ సంక్షేమ సంఘం నాయకులు
కాకతీయ, మణుగూరు: మణుగూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ కావాలనే కొంతమంది బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ ఆ నాయకులపై అక్రమ కేసులు బనాయించి,వారిని వేధింపులకు గురి చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీకి బుధవారం ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొల్లినేని రాజేష్ యాదవ్ మాట్లాడుతూ మణుగూరు సీఐ తన అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమాయక బీసీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం వెనుక ఉన్న కారణాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అన్యాయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని వారు కోరారు. బీసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే విచారించి, వాటిని ఉపసంహరించుకోవాలన్నారు. అధికారిక హోదాను అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న సీఐ తీరుపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఈఅంశాన్ని రాష్ట్ర బీసీ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తామని, బాధితులకు న్యాయం జరిగే వరకు బీసీ సంక్షేమ సంఘం పోరాటం కొనసాగిస్తుందని ఈసందర్భంగా ఆయన హెచ్చరించారు.


