గద్దెల వైపు అమ్మవారి పయనం
గుడి ప్రాంగణానికి చేరుకున్న అమ్మవారు
మరికొద్ది సమయంలో గద్దెలపైకి రానున్న సారలమ్మ
కాకతీయ, మేడారం :శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో కీలక ఘట్టం సమీపిస్తోంది. అమ్మవారు గుడి ప్రాంగణానికి చేరుకోవడంతో భక్తుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మరికొద్ది సమయంలో అమ్మవారు గద్దెలపైకి రానుండటంతో మేడారం ఆలయ పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగుతున్నాయి.

అమ్మవారి గద్దెనెక్కే కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించి, శుద్ధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
గద్దెనెక్కే వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి లక్షలాది భక్తులు ఎదురుచూస్తుండటంతో మేడారం ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో పరవశిస్తోంది.


