జైళ్ల సంస్కరణలపై కేంద్రం స్పెషల్ ఫోకస్!
ఆధునీకరణకు రూ.950 కోట్లు
పేద ఖైదీలకు ఏటా రూ.20 కోట్ల మద్దతు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశవ్యాప్తంగా జైళ్లను కేవలం భద్రతా కేంద్రాలుగానే కాకుండా సంస్కరణ, పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జైళ్ల ఆధునీకరణ ప్రాజెక్టు కింద రూ.950 కోట్లు కేటాయించగా, పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖపట్నంలోని సాయిప్రియా రిసార్ట్స్‌లో రెండు రోజుల పాటు జరిగిన ‘‘జైలు అధికారుల 9వ జాతీయ సమ్మేళం’’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఈ మేరకు ప్రసంగించారు. ఈ సదస్సును బీపీఆర్ అండ్ డీ ఆంధ్రప్రదేశ్ కారాగారాలు & సవరణ సేవల విభాగం సంయుక్తంగా నిర్వహించాయి.
హైసెక్యూరిటీ జైళ్లు.. ఆధునిక మౌలిక సదుపాయాలు
జైళ్లలో భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా, హైసెక్యూరిటీ జైళ్ల నిర్మాణం, ఆధునిక సాంకేతికత వినియోగం, మానవీయ వసతుల కల్పనపై కేంద్రం దృష్టి పెట్టిందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే రూ.101.45 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆధార్ ధృవీకరణ, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీమెడిసిన్ వంటి సదుపాయాలతో జైళ్ల నిర్వహణను ఆధునికీకరిస్తున్నామన్నారు. కస్టడీలో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ఖైదీల కోసం అమలులో ఉన్న పేద ఖైదీలకు మద్దతు పథకం ద్వారా ఇప్పటికే 16 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 237 మంది ఖైదీలకు ఉపశమనం లభించిందని బండి సంజయ్ తెలిపారు. ఈ పథకం ద్వారా న్యాయ సహాయం, పునరావాసానికి దోహదం జరుగుతోందన్నారు.
మోడల్ జైలు విధానాల అమలుపై చర్చలు
ఈ సదస్సులో మోడల్ ప్రిజన్ మాన్యువల్–2016, మోడల్ ప్రిజన్స్ & కరెక్షనల్ సర్వీసెస్ చట్టం–2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్–479 అమలు, ఖైదీల విడుదల అనంతర పునరావాసం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. బీపీఆర్ అండ్ డీ ఆధ్వర్యంలో జాతీయ జైలు శిక్షణ విధానం–2025 ద్వారా మానవ హక్కులు, వృత్తి నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 701 శిక్షణా కోర్సులు, 15,875 మంది జైలు అధికారులకు శిక్షణ అందించామని వెల్లడించారు. కేంద్రం–రాష్ట్రాల సమన్వయంతో సురక్షితమైన, మానవీయమైన, సంస్కరణాత్మక జైలు వ్యవస్థ నిర్మాణమే లక్ష్యమని, ఈ సదస్సు భవిష్యత్తు పాలసీలకు దిశానిర్దేశం చేయాలని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.


