లీగల్ సెల్‌తో బీజేపీకి బలం!
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటే లక్ష్యం
రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
కాకతీయ, హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్దఎత్తున న్యాయవాదులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ చేరికలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సమక్షంగా స్వాగతం పలికారు. పార్టీలో చేరిన న్యాయవాదులకు ఆయన కండువా కప్పి ఆహ్వానించారు. జూనియర్, సీనియర్ న్యాయవాదులతో పాటు వారి బంధుమిత్రులు కూడా పార్టీలో చేరడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. సుపరిపాలన, సంక్షేమ పథకాలు, న్యాయ సంస్కరణల పట్ల ఆకర్షితులై న్యాయవాదులు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. బ్రిటిష్ పాలన కాలంలో అమల్లోకి వచ్చిన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ వంటి చట్టాలను స్వతంత్ర భారత అవసరాలకు అనుగుణంగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కాలనీయల్ మైండ్‌సెట్‌ను తొలగించి భారతీయ న్యాయవ్యవస్థకు బలం చేకూర్చినట్లు తెలిపారు. న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసుల తగ్గింపు, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తెలంగాణలోనే దాదాపు 150 మంది యువ న్యాయవాదులకు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించడమైందని తెలిపారు. న్యాయవ్యవస్థలో వేగం, పారదర్శకత పెరగడం వల్ల సమాజం ఈ మార్పులను స్వాగతిస్తోందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో సంపూర్ణ పోటీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ అన్ని సీట్లలో పోటీ చేస్తుందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అప్పులు, అవినీతితో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని విమర్శించారు. కమిషన్ వ్యవస్థ 30–40 శాతానికి పెరిగిందని ఆరోపించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులకు న్యాయం జరగలేదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ విజయాలకు మోదీ ప్రభుత్వ అభివృద్ధి విధానాలే కారణమని, మున్సిపల్ ఎన్నికల ద్వారా తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పునాది వేస్తామని చెప్పారు. “సేవ్ తెలంగాణ – ఓట్ ఫర్ బీజేపీ” నినాదంతో ప్రజలను కోరారు. న్యాయవాదులు, మేధావులు ముందుకు వచ్చి రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు.


