విశ్వబ్రాహ్మణ యూత్‌కు నూతన నాయకత్వం
హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షుడిగా అమ్మోజు సురేష్
సంఘ సేవల గుర్తింపుతో ఏకగ్రీవ నియామకం
కాకతీయ, హనుమకొండ : విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్షుడిగా అమ్మోజు సురేష్‌ను నియమించారు. జిల్లా అధ్యక్షులు శృంగారపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ నియామకం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ సంఘంలో చురుగ్గా పనిచేస్తూ సామాజిక సేవల్లో ముందుండిన సురేష్ సేవలను గుర్తించి యూత్ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షులు శృంగారపు వెంకటేశ్వర్లు తెలిపారు. యువతను సంఘ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేలా చేయడంలో సురేష్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన యూత్ అధ్యక్షుడు అమ్మోజు సురేష్ మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానని, యువతను ఐక్యంగా ముందుకు నడిపిస్తూ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు భాస్కర్ చారి, జిల్లా కోశాధికారి కందారపు రాజు సురేష్‌ను అభినందించి, విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.


