గద్దెలపైకి వనదేవతలు.. గాల్లోకి ఎగురుతున్న నాటుకోళ్లు
ఆదివాసీ విశ్వాసానికి ప్రతీకగా ఎదురుకోళ్ల సంప్రదాయం
కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో నాటుకోళ్ల ‘ఎదురుకోళ్ల’ మొక్కులు అత్యంత విశిష్టమైన ఆదివాసీ సంప్రదాయంగా నిలుస్తున్నాయి. వనదేవతలు గద్దెలపైకి వచ్చే వేళ భక్తులు తమ భక్తిని చాటుకునే ఈ ఆచారం మేడారం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. సారలమ్మ, సమ్మక్క తల్లులు గద్దెపైకి చేరుకునే క్షణాల్లో వేలాది మంది భక్తులు నాటుకోళ్లతో గద్దెల వైపు పరుగులు తీస్తూ ఎదురుకోళ్లు ఇస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎదురుకోళ్ల మొక్కు గిరిజన సంస్కృతిలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. గద్దెల వద్ద నాటుకోళ్లను బలి ఇచ్చి, వాటితో వండిన మాంసాన్ని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ఈ మొక్కు ద్వారా తమ కష్టాలు తొలగిపోతాయని, పంటలు బాగా పండుతాయని, కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా గిరిజన కుటుంబాలు తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని అచంచలంగా కొనసాగిస్తున్నాయి.
మేడారం జాతరలో ఎదురుకోళ్ల ఇవ్వడం కేవలం మొక్కు మాత్రమే కాకుండా వనదేవతలతో భక్తుల మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా భక్తులు ఈ సంప్రదాయంలో భాగస్వాములవుతున్నారు.


