మేడారంలో ఉద్విగ్నం
తల్లి రాక కోసం జంపన్నవాగు వద్ద లక్షల మంది ఎదురుచూపులు
పూనకాలతో హోరెత్తుతున్న మేడారం..!
కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతర తొలి రోజైన బుధవారం రాత్రి వేళ మేడారం అరణ్యం ఉత్కంఠభరిత వాతావరణంతో ఉప్పొంగిపోయింది. గంట గంటకూ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అడవీ మార్గాలన్నీ జనసంద్రంగా మారాయి. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వాహనాలతో పార్కింగ్ ప్రాంతాలు పూర్తిగా నిండిపోయాయి. ఎటుచూసినా భక్తజన సందడి తప్ప మరో దృశ్యం కనిపించని పరిస్థితి నెలకొంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ (సారక్క) తల్లిని గద్దెపైకి తీసుకువచ్చే కీలక ఘట్టం సమీపించడంతో జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో భక్తులు భారీగా మోహరించారు. తల్లి రాకను ప్రత్యక్షంగా దర్శించుకోవాలన్న తపనతో వేలాది మంది భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. జంపన్నవాగు ఒడ్డున భక్తుల గుంపులతో పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారింది. డప్పుల చప్పుళ్లు, కొమ్ము బూరల నాదాలతో మేడారం పరిసరాలు మార్మోగాయి. శివసత్తుల పూనకాలతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. కొందరు భక్తులు నాటుకోళ్లు, గొర్రె పొట్టేళ్లతో మొక్కులు చెల్లించేందుకు సిద్ధంగా ఉండగా, మరికొందరు బెల్లం సమర్పణకు ఏర్పాట్లు చేసుకున్నారు. అడవంతా భక్తి, ఉత్సాహం, ఆధ్యాత్మిక పరవశంతో నిండిపోయింది. భారీ రద్దీని నియంత్రించేందుకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. క్యూలైన్లను క్రమబద్ధీకరించడంతో పాటు, డ్రోన్ కెమెరాల ద్వారా భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మార్గ మళ్లింపులు అమలు చేస్తూ, భక్తులకు తరచూ సూచనలు ఇస్తున్నారు. తెలంగాణ పోలీస్ శాఖ సోషల్ మీడియా ద్వారా రద్దీ, ట్రాఫిక్ పరిస్థితులపై అప్‌డేట్స్ విడుదల చేస్తోంది. మొత్తానికి, సారలమ్మ గద్దెపైకి చేరే కీలక ఘట్టానికి మేడారం అరణ్యం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. తల్లి దర్శనంతో జాతర మరింత వైభవంగా మారనుందని భక్తులు విశ్వసిస్తున్నారు.


