పేదలపైనే ప్రతాపమా ?
ఖమ్మంలో ఇండ్ల కూల్చివేతతో ఉద్రిక్తత
పాలకుల తీరుపై తీవ్ర విమర్శలు
మంత్రి తుమ్మల హామీ బుట్టదాఖలు
కోర్టు స్టేనుసైతం ధిక్కరిస్తున్న వైనం
సీపీఎం నాయకులపై నిర్భంధాలు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కష్టజీవులు
కాకతీయ, ఖమ్మం: వారంతా కూలీ పనులు చేసుకుంటూ పట్టాలు పొంది అప్పులు చేసి ఇండ్లు నిర్మించుకున్న నిరుపేదలు. అయినప్పటికీ వారి గోడు పట్టని పాలకులు కనీస కనికరం లేకుండా ఇళ్లను కూల్చి వేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టే వున్నా.. మంత్రి తుమ్మల ప్రజాభిప్రాయం మేరకే రోడ్ల విస్తరణ అని హామీ ఇచ్చినా… అధికారులు మాత్రం అవేమీ పట్టనట్లు అభివృద్ది పేరుతో కూల్చివేతలే పనిగా పెట్టుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేటర్ల కమీషన్ల కోసమే..
ఖమ్మం నగరంలో రోడ్డు విస్తరణ రగడ చోటుచేసుకుంది. పేదల ఇండ్ల ను తొలగించి వారిని నిరాశ్రయులయ్యేలా ఈ విస్తరణ ఉండటమే దీనికి కారణంగా తెలుస్తుంది. ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలో గల ప్రకాశ్ నగర్ రోడ్డు విస్తరణ అవసరం లేకపోయినా కార్పొరేటర్ల భర్తలు కమీషన్ల కోసమే దీనిని చేయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాభీష్టం మేరకే రోడ్డు విస్తరణ ఉంటుందని ప్రజలకు హామీ ఇచ్చినా పెత్తనం చెలాయిస్తున్న కార్పొరేటర్ల భర్తలు కమీషన్ల కోసం మంత్రి హామీ ని సైతం లెక్కచేయడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

అవసరం లేకపోయినా విస్తరణ
ఖమ్మం నగరంలోని 17, 28, 29, 30, 31డివిజన్లలో గల సుందరయ్య నగర్, శ్రీనివాస నగర్,ప్రకాశ్ నగర్ పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ కు అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ప్రస్తుతం వున్న 30 అడుగుల రోడ్డు ఈ ప్రాంతాల్లో సరిపోతుందని అధికారులు చెబుతున్నట్లు 100, 70 ,80 అడుగుల రోడ్డు అవసరం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం 30 అడుగుల మేర వున్న మట్టి రోడ్డుపై సీసీ రోడ్డు నిర్మిస్తే సరిపోతుందని వారు పేర్కొంటున్నారు. అయినప్పటికీ అధికారులు బుదవారం పేదల ఇండ్లను కూల్చి వేయడం గమనార్హం.
అసలేం జరిగింది..
రోడ్డు విస్తరకు అధికారులు కెనాల్‌ను ఆక్రమించి నిర్మించారని చెబుతున్నారు.అయితే ప్రజలు అక్కడ కెనాల్ 30 అడుగులు మాత్రమే వుందని తాము ప్రవేట్ భూములు అప్పట్లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించామని ప్రజలు చెబుతున్నారు. ఒకనాడు రైతుల సాగు కోసం ఆ కెనాల్ ను ఉపయోగించే వారని కాలక్రమేణా ప్లాట్లు చేసి అమ్ముకున్నారని పేర్కొంటున్నారు. దుర్బుద్ధితోనే కార్పొరేటర్ల భర్తలు మార్కింగ్ చేయించారని ఆరోపిస్తున్నారు. నోటీసులు ,ముందస్తు సమాచారం లేకుండా
28వ డివిజన్ పరిధిలోని ప్రకాశ్ నగర్ ప్రాంతంలో ఇండ్లు ఎటువంటి సమాచారం లేకుండా కూల్చి వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తన భర్త పక్షవాతంతో వున్నారని తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని రోదిస్తూ వాపోయారు. కొంత సమయం ఇవ్వాలని వేడుకున్నా కానికరించలేదని కన్నీటి పర్యంతమయ్యారు.
పేదలకు ఒక న్యాయం…పెద్దలకు ఒక న్యాయమా?
అభివృద్ది పనుల సందర్భంగా పేదలకు ఒక న్యాయం…పెద్దలకు ఒక న్యాయమా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మున్నేరు వరదలను, అభివృద్ధిని సాకుగా చూపి ఇండ్లను కూల్చివేస్తున్న అధికారులు నగరంలోని పెద్దలు, బడాబాబులు ఆక్రమించిన వాటిని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నిస్తున్నారు. లకారం వంటి చెరువులను ఆక్రమించిన వారిపై ఎందుకు నోరు మెదపడంలేదని మండి పడుతున్నారు. రాష్ట్ర మంత్రిని గతంలో మూడుసార్లు స్థానిక ప్రజలు కలిసిన సందర్బంగా ప్రజాభీష్టం మేరకే రోడ్డు విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారని అయినప్పటికీ కార్పొరేటర్లు కమీషన్ల కోసం ఇండ్లను కూల్చి వేయించారని ప్రజలు తెలిపారు.
ప్రశ్నించిన వారిపై నిర్బంధాలు
ఇళ్ల కూల్చివేత విషయమై గతంలోనే సీపీఎం నాయకులు బాధితులకు అండగా పలు పోరాటాలు చేశారు. దీని ఫలితంగా జిల్లా మంత్రి ప్రజాభీష్టం మేరకే కూల్చి వేతలు ఉంటాయని, కమిషనర్ అభిషేక్ అగస్త్య పేదల ఇండ్లను కూల్చ బోమని హామీ ఇచ్చారు. దీంతో సమస్య అంతా సద్దుమనిగిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఆపార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాసరావును బుధవారం ఉదయం 5 గంటలకే హౌస్ అరెస్టు చేసిన పోలీసులు కూల్చి వేతను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఆపార్టీ త్రీ టౌన్ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా రంజిత్ కూల్చివేతపై ప్రశ్నించడంతో పోలీసులు స్థానికులతో కలిపి అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పోలీసుల పహారా నడుమ కూల్చివేతలు ప్రకాశ్ నగర్ ప్రాంతంలో ఇండ్ల కూల్చివేత సందర్భంగా అధికారులు పోలీసులను భారీగా మోహరించారు. పోలీసుల పహారా నడుమ కూల్చివేతలు జరిగాయి. దీనిని స్థానికులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలిసు స్టేషన్‌కు తరలించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
అక్రమ అరెస్టులను ఖండించండి
సీపీఐ (ఎం) జిల్లా, ఖమ్మం డివిజన్ కార్యదర్శులు నున్నా నాగేశ్వర రావు, వై విక్రం
ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ ప్రాంతంలో గల రావిచెట్టు బజార్ ప్రాంతంలో బుధవారం పేదల ఇండ్ల కూల్చివేత సందర్భంగా పోలీసులు గృహ నిర్భంధం, అరెస్టు చేయడాన్ని నున్నా నాగేశ్వర రావు, వై.విక్రం వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.పేద ప్రజలకు అండగా నిలిచిన తమ పార్టీ నాయకులు, తమను నిరాశ్రయులయులను చేయవద్దన్న పేద ప్రజలను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో కూల్చమని హామీ ఇచ్చి ప్లాన్ ప్రకారం కూల్చివేశారని ఇది పాలకుల నియంతృత్వ ధోరణిని తెలియజేస్తుందన్నారు. ఈ అక్రమ అరెస్టులను ప్రజా తంత్ర వాదులందరు ఖండించాలని కోరారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు ఇండ్ల కూల్చివేతలు చేపట్టారని, దశాబ్దాలుగా అదే ప్రాంతంలో ఇండ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న పేదల నివాసాలను జేసీబీలతో నేలమట్టం చేశారని తెలిపారు. రెండు నెలల క్రితం కాలువ విస్తరణ చేపట్టాలని అధికారులు నిర్ణయించినప్పటికీ, తమ పార్టీ ఆందోళన ఫలితంగా ఆగిపోయిందని కానీ ఇవాళ నేరుగా జేసీబీలు తీసుకొచ్చి ఇండ్లను కూల్చివేయడం అన్యాయమని తెలిపారు. ఇప్పటివరకు కష్టపడి సంపాదించుకున్న వస్తువులను ధ్వంసం చేశారని తెలిపారు.నగరం అభివృద్ది కి తాము వ్యతిరేకం కాదని, అయితే పేదల ఇండ్లు కూలిస్తే తాము చూస్తూ ఊరుకోమని, బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలని వారికి అప్పటి వరకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.


