మేడారంలో తప్పిపోయిన భక్తుల కలవరం
రోజురోజుకూ పెరుగుతున్న గల్లంతులు.. ఆందోళనలో కుటుంబాలు
ప్రకటనలకే పరిమితమైన ఎయిర్‌బెలూన్ వ్యవస్థపై విమర్శలు
కాకతీయ, మేడారం బృందం : సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో సారలమ్మ గద్దెనెక్కే ఘట్టానికి చేరువవుతుండటంతో మేడారం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. లక్షలాది మంది తరలివస్తుండటంతో తప్పిపోయిన భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జంపన్నవాగు, ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తప్పిపోయిన భక్తుల శిబిరాల వద్ద తమ వారికోసం కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు గుంపుల్లో దారి తప్పుతున్న ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. గత జాతరలతో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీ అధికంగా ఉండటమే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. గత మహాజాతరల్లో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు ఉపయోగించిన ఎయిర్‌బెలూన్ కమ్యూనికేషన్ విధానం ఈసారి పూర్తిగా అమలుకావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బెలూన్లు కేవలం ప్రకటనలకే పరిమితమవడంతో ఉపయోగం లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత విధానాన్ని పునరుద్ధరించి, శిబిరాల సంఖ్య పెంచాలని భక్తులు కోరుతున్నారు.



