సెల్..హెల్..
మేడారంలో మొబైల్ నెట్‌వర్క్‌లు ఫెయిల్!
భక్తులు–మీడియా ప్రతినిధులకు తీవ్ర ఇబ్బందులు
జియో పూర్తిగా డౌన్..ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ ఎల్ నామమాత్రమే
భారీ రద్దీతో టవర్లపై ఒత్తిడి.. భద్రత, అత్యవసర సమాచారానికి ఆటంకం
కాకతీయ, మేడారం బృందం : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తరలివచ్చిన కోట్లాది భక్తులకు మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. మేడారం పరిసరాల్లో సెల్ సిగ్నల్స్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా జియో నెట్‌వర్క్ పూర్తిగా డౌన్ కావడం భక్తుల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతోంది.మేడారం జాతర ప్రాంతంలో జియో వినియోగదారులకు కాల్స్, డేటా పూర్తిగా అందుబాటులో లేవు. అత్యధికంగా ఉపయోగించే నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులను సంప్రదించలేక భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ సిగ్నల్స్ ఫోన్లలో కనిపిస్తున్నప్పటికీ, కాల్స్ కనెక్ట్ కాకపోవడం, డయల్ చేసిన వెంటనే డ్రాప్ కావడం, వాయిస్ స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అత్యవసర సందర్భాల్లో సమాచారం చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌తో కొంత ఊరట
ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు కొంత మేరకు ఉపయోగపడుతున్నాయి. కాల్స్ నెమ్మదిగా అయినప్పటికీ కనెక్ట్ అవుతుండగా, ఇంటర్నెట్ పరిమిత వేగంతో పనిచేస్తోంది. దీంతో మీడియా ప్రతినిధులు వార్తలు పంపించుకోవడానికి, భక్తులు అవసరమైన సమాచారాన్ని అందించుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్ కొంత ఉపశమనం కలిగిస్తోంది.మేడారం మహాజాతర సందర్భంగా గత జాతరల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ భక్తులకు, మీడియాకు ఉచిత ఇంటర్నెట్, వైఫై సదుపాయం కల్పించింది. దీంతో భక్తులు పరస్పరం సంప్రదించుకోవడం, తప్పిపోయిన భక్తులను త్వరగా గుర్తించడం సులభమయ్యేది.
కానీ ఈసారి ఉచిత ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో నెట్‌వర్క్ సమస్యలు తలెత్తి భక్తులు, మీడియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలాగానే బీఎస్‌ఎన్‌ఎల్ ఉచిత లేదా ప్రత్యేక నెట్‌వర్క్ సదుపాయం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
మేడారం జాతర సందర్భంగా ఒకేసారి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో మొబైల్ టవర్లపై తీవ్ర ఒత్తిడి పడినట్లు తెలుస్తోంది. తాత్కాలిక టవర్లు, అదనపు నెట్‌వర్క్ బూస్టర్లు సరిపడా ఏర్పాటు చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముందస్తు ప్రణాళికల లోపమే నేటి నెట్‌వర్క్ సంక్షోభానికి దారి తీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డిజిటల్ చెల్లింపులపై ప్రభావం
నెట్‌వర్క్ సమస్యల కారణంగా యూపీఐ, ఆన్‌లైన్ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రసాదాల కొనుగోలు, పార్కింగ్ ఫీజులు, తాత్కాలిక దుకాణాల్లో లావాదేవీలు నగదు రూపంలోనే సాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నగదు అందుబాటులో లేని భక్తులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
భద్రత, సమాచార వ్యవస్థకు ముప్పు
మొబైల్ సేవలు సరిగా లేకపోవడం భద్రతాపరంగా కూడా ఆందోళన కలిగిస్తోంది. తప్పిపోయిన భక్తులు కుటుంబ సభ్యులను సంప్రదించలేక ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సమాచారం, అధికారిక సూచనలు వేగంగా చేరకపోవడం ప్రమాదకర పరిస్థితులకు దారి తీసే అవకాశముందని పలువురు హెచ్చరిస్తున్నారు. మేడారం మహాజాతర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని టెలికాం సంస్థలు తక్షణమే స్పందించి తాత్కాలిక మొబైల్ టవర్లు, అదనపు నెట్‌వర్క్ ఏర్పాట్లు చేయాలని భక్తులు, మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.


