జిల్లా మారితే నేనే ఎన్నికలకు దూరం
జయశంకర్ జిల్లాపై దుష్ప్రచారం మానుకోండి!
అబద్ధాల పుట్టు పూర్వోత్తరాలు కేసీఆర్ ఇంట్లోనే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందన్న దుష్ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉభయ కమ్యూనిస్టు నేతలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందంటూ కొందరు కావాలనే ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. “ఒకవేళ జిల్లా నిజంగానే మారితే, నేను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయను” అంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ రకమైన అబద్ధపు ప్రచారాలు ప్రజల అభివృద్ధిని అడ్డుకునే కుట్రలేనని అన్నారు.
రూ.350 కోట్ల అభివృద్ధి కనిపించడంలేదా?
గత రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, లైటింగ్ వంటి మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని, పట్టణం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంటే కొందరు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిపై ఎవరికైనా సందేహాలుంటే అధికారికంగా వివరాలు తెలుసుకోవచ్చని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. “అబద్ధాలు ఎక్కడ పుట్టాయంటే… కేసీఆర్ ఇంట్లోనే పుట్టాయి” అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై జరుగుతున్న అసత్యపు ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని, దానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి, 30 వార్డుల్లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తీర్పుతోనే దుష్ప్రచారాలకు సరైన సమాధానం లభిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.


