నామినేషన్లలో నిబంధనలు కీలకం..!
తప్పిదాలకు తావులేకుండా పరిశీలన
స్వీకరణ కేంద్రాలపై అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తనిఖీ
రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
కాకతీయ, జనగామ : మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, చిన్నపాటి పొరపాట్లకూ అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో, అదనపు కలెక్టర్ జనగామ మున్సిపల్ కార్యాలయం, స్టేషన్ ఘన్‌పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్రాల్లో ఉన్న ఏర్పాట్లు, కౌంటర్ల పనితీరు, అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వార్డుల వారీగా కౌంటర్ల ఏర్పాటు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి వార్డుకు మూడు కౌంటర్ల చొప్పున మొత్తం 10 నామినేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉండగా, ఒక్కో వార్డుకు మూడు కౌంటర్ల చొప్పున మొత్తం 6 నామినేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా జత చేయాలని సూచించారు. పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు మహేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణ, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


