ఇందిరమ్మ ఇళ్ల ఫొటోల అప్‌లోడ్‌కు లంచం డిమాండ్
రూ.10 వేలు తీసుకుంటూ ఏఈ రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో అవినీతి బట్టబయలు
కాకతీయ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (అవుట్‌సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్‌ను లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన ఫిర్యాదిదారి ఇంటి ఫోటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి, అలాగే ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరు చేయడానికి రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదిదారి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతికి తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లంచం డిమాండ్ చేసినట్లు ఎవరైనా గమనిస్తే వెంటనే ఏసీబీని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.


