ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
సిద్ధిపేట కలెక్టర్ కె. హైమావతి
నామినేషన్ ప్రక్రియ ఏర్పాట్లపై పరిశీలన
కాకతీయ, చేర్యాల : 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో చేర్యాల పట్టణంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పురపాలక సంఘ నామినేషన్ కేంద్రం, దుబ్బాక మున్సిపాలిటీలోని నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హైమావతి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు సిద్దిపేట జిల్లాలో చేర్యాల, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 72 వార్డులకు గాను 176 పోలింగ్ స్టేషన్లలో ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయాలని, అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశించారు. అభ్యర్థి కేంద్రానికి వచ్చిన సమయం నుంచి నామినేషన్ పూర్తయ్యే వరకు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని, అన్ని కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ జరుగుతోందని తెలిపారు.


