విధేయతకు పట్టం.. సేవకు గుర్తింపు!
మంత్రి అండతో ప్రజాక్షేత్రంలోకి మహేష్ కుటుంబం
ఏదులాపురంలో 2వ వార్డు అభ్యర్థిగా ఏనుగు స్వరూప ఖరారు
కాకతీయ, కూసుమంచి : ఏదులాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిబద్ధత, విధేయత ఉన్న కార్యకర్తలకు నాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందనే విషయాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరోసారి చాటిచెప్పారు. తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే యూత్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు మహేష్ విధేయతకు పట్టం కడుతూ… 2వ వార్డు నుంచి ఆయన మాతృమూర్తి ఏనుగు స్వరూపను అధికారికంగా అభ్యర్థిగా ఖరారు చేశారు. ఏనుగు మహేష్ రాజకీయ ప్రయాణం నిస్వార్థ సేవతో ముడిపడి ఉంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు అన్నదానం చేయడం నుంచి, మున్నేరు వరదల సమయంలో ప్రాణాలకు తెగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వరకు ఆయన చేసిన సేవలు స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు, తన రక్తంతోనే తన ఆరాధ్య నాయకుడి చిత్రపటాన్ని గీసి విధేయతను చాటిన ఘటన అప్పట్లో కార్యకర్తల్లో పెద్ద చర్చనీయాంశమైంది. వార్డు రిజర్వేషన్ సమీకరణాల నేపథ్యంలో తనకు వచ్చిన అవకాశాన్ని కుటుంబానికి కాదు… ప్రజా సేవకు వినియోగించాలనే ఉద్దేశంతో మహేష్ తన మాతృమూర్తి ఏనుగు స్వరూపను బరిలోకి దింపారు. మంత్రి పొంగులేటి మార్గనిర్దేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. స్థానికంగా లభిస్తున్న స్పందన, ప్రజల మద్దతు చూస్తుంటే 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు స్వరూప విజయం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ట.


