అశ్వాపురంలో ఆక్సిజన్–18 మెగా ప్లాంట్
రూ.160 కోట్ల పెట్టుబడి.. 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యం
దేశీయ అవసరాలతో పాటు ఎగుమతులకు బాట
31న ఏఈసీ ఛైర్మన్ అజిత్‌కుమార్ మొహంతి చేతుల మీదుగా ప్రారంభం
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రం మరో కీలక జాతీయ ప్రాజెక్ట్‌కు వేదిక కాబోతోంది. ఇప్పటికే ఉన్న భారజల ప్లాంట్‌కు అనుబంధంగా ఆక్సిజన్–18 మెగా ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్ధమైంది. సుమారు రూ.160 కోట్ల వ్యయంతో, 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. జనవరి 31న అజిత్‌కుమార్ మొహంతి, భారత అణుశక్తి కమిషన్ (ఏఈసీ) ఛైర్మన్ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసే ఆక్సిజన్–18 దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసే అవకాశం కూడా కల్పించనుంది. వైద్య, శాస్త్రీయ పరిశోధన రంగాల్లో ఆక్సిజన్–18కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మెగా ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారు. అశ్వాపురంలో ఆక్సిజన్–18 ఉత్పత్తి ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే 2022లో రూ.50 కోట్ల వ్యయంతో, 10 లీటర్ల సామర్థ్యంతో తొలి ఆక్సిజన్–18 ప్లాంట్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. అది విజయవంతంగా కొనసాగుతోంది. ఆ ప్రాజెక్ట్‌తో అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, ఇజ్రాయెల్, రష్యాల సరసన భారత్ ఆక్సిజన్–18 ఉత్పత్తి చేసే ఆరో దేశంగా నిలిచింది. ఆ అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు భారీ స్థాయిలో కొత్త ప్లాంట్‌కు శ్రీకారం చుట్టారు.
క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర
ఆక్సిజన్ ఐసోటోపుల్లో 16, 17, 18 రకాలు ఉండగా, సాధారణ నీటిలో ఆక్సిజన్–18 కేవలం 0.2 శాతం మాత్రమే ఉంటుంది. ప్రత్యేక సాంకేతిక విధానాలతో దీన్ని 95.5 శాతం స్వచ్ఛత వరకు పెంచుతారు. ఈ ఐసోటోపు క్యాన్సర్‌ను గుర్తించడంలో కీలకమైన ట్రేసర్‌గా పనిచేస్తుంది. అమెరికా, ముంబైలో జరిగిన తాజా పరిశోధనల్లో క్యాన్సర్ చికిత్సలో దీని ప్రాధాన్యత స్పష్టమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక గ్రాము ఆక్సిజన్–18 ధర రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. అశ్వాపురంలో 100 కిలోల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుతో దేశీయ అవసరాలు తీరడమే కాకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, ఏజెన్సీ ప్రాంతంలో ఈ మెగా ప్రాజెక్ట్ స్థాపనతో అశ్వాపురం అణుశక్తి, వైద్య పరిశోధనల కేంద్రంగా మరింత గుర్తింపు పొందనుంది.


