ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!
చరిత్రకు జానపద స్వరం..అద్భుతం
పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ వీరగాథ
భక్తిని రగిలించిన గద్దర్ గానం
సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్
కాకతీయ, మేడారం బృందం : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర వేళ విడుదలైన కొత్త జానపద పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ జానపద గాయకుడు నల్గొండ గద్దర్ (నర్సన్న) పాడిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వేదికలపై విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వనదేవతల చరిత్ర, మేడారం జాతర విశిష్టతను గుండెల్లోకి దిగేలా చెప్పిన ఈ గానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో 13వ శతాబ్దంలో పన్నుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క–సారలమ్మల వీరత్వం, త్యాగాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించారు. కాకతీయుల కాలంలో జరిగిన ఆ పోరాటాలను, వనదేవతల త్యాగాన్ని జానపద శైలిలో ఆవిష్కరించడం పాటకు ప్రత్యేకతగా నిలిచింది. చరిత్రను సులభంగా ప్రజలకు చేరువ చేసేలా పదాలు, స్వరాలు సాగడం విశేషం.
మేడారం వైభవం ప్రతిబింబం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి పొందిన మేడారం వైభవం, అక్కడి భక్తి భావం ఈ పాటలో స్పష్టంగా ప్రతిఫలించింది. జంపన్న వాగు, గద్దెలు, మొక్కుల ఘట్టాలు, భక్తుల తాకిడి వంటి అంశాలను గద్దర్ తన గానంలో సహజంగా మేళవించారు. జాతర వాతావరణాన్ని వినిపించేలా తీసుకెళ్లడం శ్రోతలకు మేడారం అనుభూతిని మళ్లీ గుర్తు చేస్తోంది. నల్గొండ గద్దర్ తనదైన గొంతు, భావోద్వేగంతో పాడటంతో ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్, వేలాది షేర్లతో ఈ సాంగ్ దూసుకుపోతోంది. భక్తులతో పాటు యువత కూడా ఈ పాటను విస్తృతంగా షేర్ చేస్తూ, మేడారం జాతర ప్రాధాన్యతను మరోసారి చాటుతున్నారు. మొత్తానికి, చరిత్ర–భక్తి–జానపద సంగీతం మేళవించిన ఈ కొత్త మేడారం పాట, జాతర సందడికి మరింత ఊపునిస్తూ ఫుల్ ట్రెండింగ్‌లో నిలిచింది.


