నేడు మేడారంలో మహా జాతర ఆరంభం..!
సారలమ్మ ఆగమనంతో వనదేవతల వేడుకలకు శ్రీకారం
తొలిరోజు సాయంత్రం గద్దెపైకి సారలమ్మ
కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాక
తల్లి రాక కోసం లక్షలాది భక్తుల ఎదురు చూపు
జనంతో కిటకిటలాడుతున్న మేడారం వనం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఖ్యాతి పొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర – 2026 నేడు (జనవరి 28) అధికారికంగా ప్రారంభమవుతోంది. వనదేవతల దర్శనానికి లక్షలాది భక్తులు ఇప్పటికే మేడారం బాట పట్టారు. దారులన్నీ మేడారం వైపే మళ్లినట్టుగా కనిపిస్తున్నాయి. చీమల పుట్టలోలే భక్తజనం తరలివచ్చి మేడారం అడవిని నింపేసింది. జాతరలో భాగంగా తొలిరోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారు గద్దెపైకి చేరుకోనున్నారు. ఆదివాసీ సంప్రదాయాల నడుమ అమ్మవారి ఆగమనాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో స్వాగతించనున్నారు. సారలమ్మ రాకతో జాతర వాతావరణం ఉత్సాహంతో మార్మోగనుంది.

ఇతర దైవాల రాక
సారలమ్మతో పాటు కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులను కూడా ఆదివాసీ ఆచారాల ప్రకారం మేడారం గద్దెలకు తీసుకువస్తారు. ఈ ఘట్టంతో మేడారం అడవులు మంత్రోచ్చారణలు, డప్పుల మోతలతో ఆధ్యాత్మిక శబ్దాలతో మార్మోగనున్నాయి. జాతర సందర్భంగా భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. జాతర ప్రారంభంతో వాగు పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. పుణ్యస్నానాల అనంతరం భక్తులు గద్దెల వైపు అడుగులు వేస్తున్నారు.
మేడారం జాతర–2026 పూర్తి షెడ్యూల్
జనవరి 28 (బుధవారం): సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దె ప్రతిష్ఠ
జనవరి 29 (గురువారం): చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి ఆగమనం
జనవరి 30 (శుక్రవారం): నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పణతో ప్రధాన ఘట్టం
జనవరి 31 (శనివారం): వనదేవతల వన ప్రవేశంతో జాతర ముగింపు
మొత్తానికి, వనదేవతల కటాక్షం కోసం భక్తుల అడుగులు మేడారం వైపే పడుతున్నాయి. సారలమ్మ ఆగమనంతో మొదలైన ఈ మహా జాతర రోజురోజుకూ మరింత వైభవంగా సాగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి


